ఉరుకులు పరుగుల నేటి ఆధునిక జీవితంలో మనిషికి ప్రశాంతత అనేది చాలా వరకు కొరవడింది. క్షణం తీరిక లేకుండా ఆధునిక జీవితంలో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటున్నాం. విశ్రాంతి లేకుండా పోరాడుతున్న మనిషికి మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మనలో ఎన్నో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి.(Stress relief)

మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాల్ గా మారింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక ఒత్తిళ్లను చాలామంది తట్టుకోలేక వాళ్ల ప్రాణాలను సైతం బలవంతంగా తీసుకుంటున్నారు.
ఉద్యోగంలో పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు,ఆర్థిక సమస్యలు, ఉద్యోగం రాలేదని, భారంగా మారిన చదువుల కారణంగా చాలామంది మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.
పిల్లల్లో..
నేటి సమాజంలో చిన్నపిల్లలపై మానసిక ఒత్తిడి అధికంగానే ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ వారిని ఆటపాటలతో కాకుండా పుస్తకాలతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు వారి ఆశయాలను పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా చిన్నతనంలోనే వారిపై బలవంతంగా రుద్దడం, మరియు తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా చాలా మంది పిల్లలు చిన్నతనంలోనే మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.
యువతలో..
నేడు యువతలో చదువులలో, ఉద్యోగాలలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోవడం, ఏదో సాధించాలనే తపన, విశ్రాంతి లేకుండా తమ లక్ష్యం కోసం పనిచేస్తు ఉండటం,వారిలో ప్రతిభ ఉన్నా తగిన అవకాశాలు రాకపోవడం, ప్రేమ విఫలం ఇలాంటి కారణాలతో చాలా మంది యువత మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.
నడివయసు వారిలో..
నడి వయసు వారిలో ఎక్కువగా కుటుంబ బాధ్యతలు, పనిచేసే చోట పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, ఆర్థిక సమస్యలు ఇలాంటి కారణాలతో నడి వయసు వారు ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు గురి అవుతున్నారు.
వృద్దులలో..
వృద్ధులలో అయితే ఆరోగ్య సమస్యలు, తమను పట్టించుకునే వారే లేరని బాధ పడుతూ ఉండటం, ఆ వయసులో సంపాదించే శక్తి లేక ఆర్థిక సమస్యలు ఇలాంటి కారణాలతో అనేకమంది వృద్ధులు మానసిక ఒత్తిళ్లకు గురౌతున్నారు.
ఈ మానసిక ఒత్తిడి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిళ్లు వలన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తలనొప్పి, జీవితం మీద విరక్తి చెందడం, అశాంతి మరియు అన్ని వయసుల వారిలో అనేక ఆరోగ్య సమస్యలు , మానసిక సమస్యలు వస్తున్నాయి.
ఈ మానసిక ఒత్తిళ్లను అన్ని వయసుల వారూ ఎలా ఎదుర్కోవాలంటే..
- ముందుగా చిన్నపిల్లలపై చదువుల భారం పడకుండా చూసుకోవాలి, వారి బాల్యం ఆట పాటలతో కూడిన విద్యను అందించాలి, తల్లిదండ్రులు వారి ఆశలను, ఆశయాలను బాల్యంలోనే వారిపై వేయరాదు, కుటుంబ సమస్యలు పిల్లలపై ప్రభావం పడకుండా చూసుకోవాలి.
- యువతలు పోటీతత్వాన్ని తట్టుకునే మనోధైర్యం కల్పించేలా ప్రభుత్వాలు, కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. యువత కూడా ధైర్యంతో అవకాశాలు రాకపోయినా కృంగిపోకుండా కృషి చేయాలి, యువత అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు.
- నడివయసు వారు ఉద్యోగం లోని ఒత్తిళ్లను ఆఫీస్ వరకే వదిలేసి ఎక్కువగా సమయం కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించడం, ఉద్యోగం లోని ఒత్తిళ్లను సాధ్యమైనంతవరకు టెన్షన్ కు గురికాకుండా అధిగమించేందుకు ప్రయత్నించాలి, భార్య భర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులందరూ సామరస్యంగా ఉండేలా చూసుకోవాలి.
- వృద్ధులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, మీకు మేమున్నామంటూ పిల్లలు వారికి భరోసా కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపాలి.
ఈ విధంగా చేయడం వలన అనేక మందిలో మానసిక ఒత్తిళ్లను పోగొట్టి, జీవితాలను సంతోషకరంగా చేసుకోవచ్చు
Also Read : బాదం పప్పులు నానబెట్టి తింటే మంచిదా? నానబెట్టకుండా తింటే మంచిదా?